చిన్నారికి తండ్రిలా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు నీచపు పనికి తెరతీశాడు. చిన్ని పిల్ల అని కూడా చూడకుండా లైంగికంగా వేధించసాగాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ నీచుడిపై పోలీసు స్టేషన్లో పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రేగుచెట్టు రమేష్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో చదివే ఓ ఐదో తరగతి బాలికతో రమేష్ కొద్ది రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తాక కూడని చోట తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడు. విద్యార్థిని ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పాఠశాలకు వచ్చి రమేష్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని రమేష్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రమేష్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రమేష్‌కు కఠిన శిక్ష వేయాలని స్థానికుడు డిమాండ్ చేస్తున్నారు.