తెలుగులో ఉన్న అతికొద్ది టాక్ షోల్లో ఒకటి సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్. ఈ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటులతో ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇటీవల ఈ షో నాలుగో సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు.ఈ నెల 25న ఈ ఎఎపీసోడ్ ప్రసారం కానుంది. అన్‌స్టాపబుల్ సీజన్ – 4 మిగిలిన ఎపిసోడ్స్ కూడా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలు ఈ షోలో కనువిందు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్, రష్మిక మందన్న వంటి వాళ్ల ఇంటర్వ్యూలు షూట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య కూడా అన్ స్టాపబుల్ షూట్‌కి హాజరయ్యారు. ఈ రోజు ఉదయమే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగువా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్లు సమాచారం. సూర్యతో పాటు డైరెక్టర్ శివ, హీరోయిన్ దిశాపటాని కూడా ఈ షోలో పాల్గొంటారని తెలుస్తోంది. సూర్య ఇప్పటికే కంగువా ప్రమోషన్లలో భాగంగా ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.