సైబర్ నేరగాళ్ల దోపిడీలకు హద్దు లేకుండా పోతోంది. సామాన్య ప్రజల నుంచి బడా వ్యాపార వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులను రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు. హానీ ట్రాప్‌లు చేయడం, న్యూడ్ వీడియో కాల్స్ చేసి రికార్డింగులతో బెదిరించడం వంటి ఘటనలు ఈ మధ్య చాలా పెరిగిపోయాయి. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా న్యూడ్ వీడియో కాల్ రావడం కలకలం రేపింది. త్వరగా అప్రమత్తమైన ఆయన పోలీసులు, సైబర్ సెక్యురిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ నెల 14న అర్ధరాత్రి ఓ వీడియో కాల్ వచ్చింది. ప్రజా ప్రతినిథి కావడంతో ఎవరైనా అవసరంలో ఉండి చేశారేమో అని ఆయన కాల్ లిఫ్ట్ చేశారు. వీడియో కాల్ దృశ్యాన్ని చూసిన సదరు ఎమ్మెల్యే ఒక్కసారిగా షాకయ్యారు. ఒక అమ్మాయి నగ్నంగా కనిపించడంతో వెంటనే తేరుకొని కాల్ కట్ చేశారు. అనంతరం ఈ వీడియో కాల్ గురించి ఈ నెల 17న హైదరాబాద్‌లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో సదరు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. మామూలుగానే సైబర్ మోసగాళ్లు కాల్ చేశారా లేదా ఎవరైనా ఎమ్మెల్యేపై వ్యక్తిగత కక్షలతో ఇలాంటి ఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో విచారిస్తున్నారు.